4. మనస్సు ఆడించే ఆటలు
మన లోపలి వెలుపలి ప్రపంచాలకు ఇంద్రియాలు ద్వారాల వంటివి. అందుకే భగవద్గీత వాటిని అర్థం చేసుకోమని నొక్కి
చెబుతుంది. “ఒకటిగా పనిచేసే నాడీకణాలు (న్యూరాన్లు) ఒక్కటిగానే ముడిపడి ఉంటాయని” నాడీ
శాస్త్రం ప్రతిపాదిస్తుంది. దీనినే హార్డ్ వైరింగ్ అంటారు. భగవద్గీతలోని వాక్యాలు
కూడా, ఆ కాలాన్ని బట్టి ఉపయోగించే భాషలో ఇదే సందేశాన్ని ఇస్తాయి.
మన
మెదడులో 100 బిలియన్ న్యూరాన్లు ఉన్నాయి. కొన్ని మన డిఎన్ఏ (DNA)
కారణంగా ముడిపడి అసంకల్పితంగా జరిగే ప్రాథమిక దేహ క్రియల కోసం
ఉపయోగించబడతాయి. మరికొన్ని మన జీవితకాలంలో మనము చేసే కర్మల ద్వారా ముడివేయ బడతాయి.
మొదటి రోజు డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నప్పుడు మనకు కారు నడపడం కష్టంగా
అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా మనం దానికి అలవాటు పడతాము. ఎందుకంటే, అప్పటివరకు
వాడుకలో లేని న్యూరాన్లను మన మెదడు హార్డ్ వైరింగ్ ద్వారా జోడించి డ్రైవింగ్ కు
సంబంధించిన అన్ని చర్యల్లో పాల్గొనేలా చేస్తుంది. దీనికి సమయం పడుతుంది.
అన్ని
రకాల నైపుణ్యాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మామూలు నడక నుంచి ఆటల దాకా, ఒక
సర్జన్ జరిపే క్లిష్టమైన శస్త్ర చికిత్సల దాకా ఇదే జరుగుతుంది. హార్డ్ వైరింగ్
మెదడు యొక్క శక్తిని బాగా ఆదా చేసి మన జీవితాలను సులభం చేస్తుంది.
నవజాత
శిశువు 'సార్వభౌముని' లాగా అనేక
పనులను చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తరువాత కుటుంబం, సహచరులు, సమాజం
చేసే పెంపకంలో అనేక నాడీ బంధాలు (patterns) ఏర్పడతాయి. ఈ
నాడీ బంధాలు బాహ్య ప్రపంచం నుండి ఒక నిర్దిష్టమైన ప్రేరణలు, అనుభూతులకు
అలవాటు పడటం వల్ల వాటిని పొందడానికి మనం తీవ్రంగా కృషి చేస్తాము. ఈ అలవాట్లనే మనం
కోరికలని కూడా అనవచ్చు. అవి మన ప్రవర్తనను అపస్మారక స్థాయి నుండి నడిపిస్తాయి.
ఉదాహరణకు, మన నాడీ బంధాలు పొగడ్తలను ఆశించి ఆస్వాదిస్తాయి కనుక మనందరం వాటిని
వినడానికి ఇష్ట పడతాము. ఈ నాడీ బంధాలే మనలో ఉత్పన్నమయ్యే ఆకాంక్షలు, కలిగే
దురభిప్రాయాలు, ఏర్పడే అంచనాలకు పునాదులు.
ఈ
నాడీ బంధాలన్నిటి కలయిక, వీటి అలవాట్ల
మీద ఆధారపడే మన ప్రవర్తనలనన్నీ కలిపితే అదే అహంకారం. నేటి ప్రపంచంలో విజయం సంతోషం
అంటే నాడీ బంధాలు కోరుకునే ఉత్ప్రేరకాలను పొందటమే. వీటన్నింటినీ ఛేదించినప్పుడు
మాత్రమే మనల్ని మనలో కేంద్రీకరించుకోగలము. ఫలితంగా బాహ్య ప్రేరణలతో నిమిత్తం
లేకుండా శాశ్వతమైన సంతోషాన్ని పొందగలం. దీన్నే శ్రీకృష్ణుడు ఆత్మ రమణీయత అని
చెప్తున్నారు.
గీతోపదేశం
ప్రకారం జీవించటం అంటే భగవద్గీత అందించిన అనేక సాధనాలు, నియంత్రణలు
పాటించి ఈ నాడీ బంధాల నుండి మనలను మనం విముక్తి చేసుకోవటమే. ఈ విధంగా విముక్తి
చేసుకున్నప్పుడు మన దుఃఖానికి కారణమైన విభజనలు, బేధాభిప్రాయాల
నుండి కూడా విముక్తి పొంది శాశ్వత ఆనందాన్ని పొందుతాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి