28. అన్ని ధర్మాలను త్యజించి పరమాత్మలో లీనం


శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని గురించి (2.31-2.37), పర ధర్మాన్ని గురించి (3.35) వివరించి, చివరికి అన్ని ధర్మాలను విడనాడి (18.66) పరమాత్మతో ఐక్యమవమని ఉపదేశిస్తున్నారు.

అర్జునుడి విషాదం యుద్ధంలో పోరాడి తన సోదరులను చంపితే తన ప్రతిష్ట దెబ్బ తింటుందన్న అహం నుండి పుట్టిన భయం వల్ల జనించింది. యుద్ధాన్ని వదిలి వెళ్ళినా కూడా అతని ప్రతిష్ట దెబ్బతింటుందని ఎందుకంటే యుద్ధం అతని స్వధర్మమని శ్రీకృష్ణుడు అతనికి చెబుతారు (2.34-2.36). లోకమంతా అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడ్డాడని అనుకుంటుంది. ఒక క్షత్రియుడికి యుద్ధానికి భయపడ్డాడన్న అపకీర్తి మరణము కంటేను బాధాకరమైనది అని వివరిస్తారు.
స్వధర్మం లోపాలతో కూడుకున్నది, లాభాన్ని కలిగించనిది అయినా కూడా పరధర్మం కంటే మెరుగైనది, స్వధర్మ మార్గంలో మరణించుట శ్రేయస్కరము. పరధర్మాచరణము భయావహము (3.35) అని శ్రీకృష్ణుడు బోధిస్తారు.
మనం విజయవంతమైన వ్యక్తులను చూసినప్పుడు మన బాహ్య ఇంద్రియాలకు పరధర్మం చాలా సులువుగా కనిపిస్తుంది. కాని స్వధర్మానికి క్రమశిక్షణ, కృషి అవసరం. దాన్ని నెమ్మదిగా మనలో నుండి వెలికి తీయాలి.

సాధారణంగా మనం పుట్టిన ప్రతిష్టాత్మకమైన స్థలం/ కుటుంబం, పాఠశాలలో గ్రేడ్లు, ఉద్యోగం లేదా వృత్తిలో మంచి సంపాదన, మనకు వచ్చే అధికారం/కీర్తి వంటి వాటితో పాటుగా ఇతర అనుకూల విషయాలతో పోల్చుకుని మన విలువ గురించి మనం అంచనా వేసుకుంటాము. కాని శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారని వారి స్వధర్మాన్ని బట్టి ప్రత్యేకంగా వికసిస్తారని చెబుతున్నారు. అందరిలో ఉన్న అవ్యక్తం ఒకటే అయినా వ్యక్తమైన ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైనది.

చివరికి శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలను పరిత్యజించి తనను శరణు కోరమని అప్పుడు తాను అన్ని పాపాలనుండి వారికి విముక్తి కలిగిస్తానని అభయం ఇస్తారు (18.66). ఇది భక్తి యోగంలో శరణాగతితో పోల్చదగినది; ఆధ్యాత్మికతకు ఒక పునాది వంటిది.
సముద్రంలో కలిసిపోయి నది తన స్వధర్మాన్ని విడిచినట్లు, మనం కూడా పరమాత్మలో లీనం కావడానికి అహంకారాన్ని, స్వధర్మాన్ని త్యజించాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు

3. వర్తమానానిదే ప్రాధాన్యత