37. అదే అర్జునుడు అదే బాణం

“ అదే అర్జునుడు అదే బాణం ”, అన్నది ఒక సామెత. విజయవంతమైన/సమర్ధుడైన వ్యక్తి ఎప్పుడన్నా తన కర్మ క్షేత్రములో విఫలమైనప్పుడు ఆ స్థితిని వివరించడానికి తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. యోధునిగా అర్జునుడు ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోలేదు. అతని జీవితపు చరమాంకంలో కొంతమంది కుటుంబ సభ్యులను , బందిపోట్ల సమూహం నుండి రక్షించడానికి చేసిన ఒక చిన్న యుద్ధంలో ఓడిపోయాడు. ఆ స్థితిని తన సోదరుడికి వివరిస్తూ ఇలా అంటాడు , “ ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను అదే అర్జునుడిని , ఇవి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచిన అవే బాణాలు , కానీ ఈసారి నా బాణాలు వాటి లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి లేదా వాటి శక్తిని కోల్పోయాయి. ” అప్పుడు కుటుంబాన్ని కాపాడుకోలేక పారిపోవాల్సి వచ్చిందని ఆయన శోకించాడు. మనలో ఎవరికైనా ఇలా జరగవచ్చునని జీవిత అనుభవాలు చెబుతున్నాయి. చాలా సార్లు ప్రతిభావంతులైన క్రీడాకారులు కొంతకాలం తమ క్రీడా సామర్థ్యాన్ని ( form) కోల్పోతారు. ఒక నటుడు , గాయకుడు విఫలమవుతారు. ఇది అదృష్టం , చెడు సమయం మొదలైన వాటికి ఆపాదించబడుతుంది కానీ అసలు కారణం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. అనుమానాలు , ఊహాగానాలు తప్ప దీనికి శాస్త్రీయ వివరణ లేదు.