35. కర్మయోగమే జీవన మార్గం

 

శ్రీకృష్ణుడు (2.47) మనకు కర్మ చేసే హక్కు ఉంది. కానీ కర్మఫలం పై అధికారం లేదని అంటారు. మనకు ప్రియమైన వారిలో ఎవరికైనా శస్త్రచికిత్స అవసరమైతే నిజాయితీ గల, సమర్థుడైన సర్జన్ కోసం చూస్తాము. అతని యోగ్యత శస్త్రచికిత్స విజయాన్ని సూచిస్తుంది అతని నిజాయితీ అతను ఎటువంటి అనవసరమైన శస్త్రచికిత్సను చేపట్టకుండా చూసుకుంటుంది. సంక్షిప్తంగా మనము కర్మయోగి అయిన సర్జన్ కోసం వెతుకుతున్నాము. ఈ పరిస్థితిలో ఉన్న రెండు ప్రత్యేకతలు ఈ శ్లోకాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.

      మనకు సేవచేసే వారందరూ కర్మయోగులుగా ఉండాలని, సర్వోత్తమ ఫలితాలను అందించాలని ఆశిస్తాము. అదే సమత్వ సూత్రాన్ని మనకు అన్వయించుకుంటే మనం కూడా మన దైనందిన జీవితంలో ఇతరులకు సేవ చేస్తూనే కర్మయోగులమై ఉండాలి. మనం కర్మ క్షేత్రములోను, కుటుంబ వ్యవహారాల్లోనూ ఏ బాధ్యత నిర్వహిస్తున్నా కూడా సర్వశ్రేష్ట కృషి చెయ్యాలని ఈ శ్లోకం చెబుతోంది.

      శ్రీకృష్ణుడు, కర్మ యోగ సాధనలో వేసే చిన్న చిన్న అడుగులు మనలను సమత్వానికి దగ్గరగా తీసుకువస్తాయని అది మనలో ఆనందాన్ని కలిగిస్తుందని హామీ ఇస్తున్నారు. మనం మళ్లీ కలుసుకునే అవకాశం లేని వారికి మన అత్యుత్తమ సేవలను అందించగలిగినప్పుడు మనం కర్మ యోగిగా మారే మార్గంలో దృఢంగా ఉన్నామని అర్ధం.

      కర్మఫలం గురించి చింతించకుండా మనం కర్మలో లోతుగా నిమగ్నమైనప్పుడు మనం కాలాతీత (సమయాన్ని అధిగమించడం) స్థితికి చేరుకొంటాము. అంటే ఇక్కడ సమయంతో సంబంధం లేదు. పై ఉదాహరణలో మనం ఆపరేషన్ థియేటర్ వెలుపల వేచి ఉన్నప్పుడు సమయం నెమ్మదిగా గడుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు, ఒక కర్మయోగి సర్జన్ ఆపరేషన్ లో నిమగ్నమై సమయాన్ని గురించిన స్పృహను కోల్పోతాడు. మరొక విధంగా చూస్తే అతని దృష్టిలో సమయం ఆగిపోయి ఉంటుంది.

      దుఃఖం అనే చెట్టును పెకిలించమని శ్రీకృష్ణుడు మనకు చెబుతున్నారు. దాని వేళ్ళు కర్మ ఫలాల కోసం చేయబడే కర్మలు తప్ప మరేమీ కాదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు

3. వర్తమానానిదే ప్రాధాన్యత