40. కర్తృత్వ భావనను విడనాడడం

 

యోగ స్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి-అసిద్ధిల ఎడ సమత్వ భావము కలిగియుండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగ మందురుఅని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (2.48). మరో మాటలో చెప్పాలంటే మనల్ని మనం ద్వంద్వాలతో గుర్తించుకోవడం మానేసినప్పుడు మనం ఏమి చేసినా సమంజసంగా ఉంటుంది.

      మన రోజువారీ జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాము; ఎంపికలు చేస్తూ ఉంటాము. ఎప్పుడూ నిర్ణయించే మనస్సు అందుబాటులో ఉన్న అవకాశాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఈ అవకాశాలను సుఖం/దుఃఖం, లాభం/ నష్టం, గెలుపు ఓటమి మరియు విజయం /వైఫల్యంగా వర్గీకరిస్తారు (2.38).

      'సమత్వం' అనేది పరస్పర విరుద్ధ ధృవాలను సమానంగా పరిగణించడం; దీనిని సాధారణంగా ద్వంద్వాలను అధిగమించడమని పిలుస్తారు. ఈ అవగాహన లోతుగా నాటుకున్నప్పుడు మనస్సు శక్తిహీనమై, ఎంపికతో పనిలేని అవగాహనను పొందుతుంది. మనం నిద్రలో లేదా మత్తులో ఉనప్పుడు సహజంగానే ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతాము. మనకు ఆలోచించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆలోచించకుండా ఉండగల సామర్థ్యమే సమత్వము. అంటే ప్రస్తుత క్షణంలో సజీవంగా ఉంటూ కేవలం ఒక పరిశీలకుడిగా ఉండడము.

      కర్మ చేస్తున్నప్పుడు సమస్థితిని పొందేందుకు ఆచరణాత్మక మార్గం ఏమిటంటే కర్తృత్వ భావనను వదిలి సాక్షి గా మారడం. ఇది పూర్తి తీవ్రత, నిబద్ధత, అంకితభావం, సమర్థత, అభిరుచితో నాటకంలో పాత్రను ప్రదర్శించడం లాంటిది; అంటే ఉన్న పరిస్థితుల్లో మనము శాయశక్తులా వ్యవహరించడంలాంటిది. అదేవిధంగా జీవితమనే గొప్ప వేదికపై మనకు ఇచ్చిన పాత్రలను పూర్తి అంకితభావంతో పోషించాలి. ఇది కొడుకు కూతురు, భార్య/భర్త, తల్లిదండ్రులు, స్నేహితుడు, ఉద్యోగి, యజమాని, సహోద్యోగి, సూపర్‌వైజర్ మొదలైన వారి పాత్రలు కావచ్చు. ఒక రోజులో మనం అనేక విభిన్న పాత్రలను ధరిస్తాము; ప్రతి ఒక్క పాత్రను పోషిస్తున్నప్పుడు మన వంతు కృషి చేయాలి, కానీ మనం నాటకంలో కేవలం ఒక పాత్రను మాత్రమే ధరిస్తున్నామనే పూర్తి అవగాహనతో ఉండాలి.

      జీవితంలో మనకు లభించిన అన్ని పాత్రలలో కొంత కాలం పాటు మనం దీన్ని ఆచరించడం ప్రారంభించవచ్చు. తద్వారా ఇది మనలో తెచ్చే సామరస్యాన్ని మనంతట మనమే చూడవచ్చు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

6. శాసన నియమాలు

42. అహంకారపు వివిధ కోణాలు.

73. సమర్పణ కళ