47. స్థిరమైన బుద్ధి
మన జీవిత గమనంలో ఒకే విషయం పై
విరుద్ధమైన అభిప్రాయాలను విన్నప్పుడు మనం కలవరపడతాము - అది వార్తలు, తత్వశాస్త్రం, ఇతరుల అనుభవాలు, నమ్మకాలు ఏమైనా కావచ్చు. వివిధ అభిప్రాయాలను విన్నప్పటికీ మన బుద్ధి
నిశ్చలంగా (చలించకుండా), సమాధిలో స్థిరంగా ఉన్నప్పుడు మనం
యోగాన్ని పొందుతామని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.53).
ఈ
శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చెట్టు సరైన ఉదాహరణ. దాని పై భాగం కనిపిస్తుంది; క్రింది భాగం వేళ్ల మూల వ్యవస్థతో కూడి అదృశ్యంగా ఉంటుంది. పై భాగం గాలుల
బలానికి ఊగుతుంది; కానీ వాటివల్ల వేళ్ల వ్యవస్థ ప్రభావితం
కాదు. ఎగువ భాగం బాహ్య శక్తులకు ఊగిసలాడుతున్నప్పుడు లోపలి భాగం సమాధి స్థితితో
నిశ్చలంగా ఉంటుంది. స్థిరంగా ఉండడంతో పాటు పోషకాహారాన్ని అందించే తన బాధ్యతను
నిర్వహిస్తుంది. బాహ్యభాగం ఊగిసలాడుతూ అంతర్గతంగా నిశ్చలంగా ఉండటమే చెట్టుకు
యోగస్థితి. -
అజ్ఞాన
స్థాయిలో మనకున్న చంచల బుద్ధి బాహ్య ఉద్దీపనలకు ప్రభావితమై దానంతటదే
ఊగిసలాడుతుంది. ఈ ఉగిసలాట తాత్కాలిక స్పందనలు, ఉద్వేగాలు, కోపాల రూపంలో మన నుంచి బయటకు వచ్చి మన జీవితాలను సమస్యాత్మకం చేస్తాయి. మన
వ్యక్తిగత జీవితాలనే కాక మన కుటుంబ సభ్యుల జీవితాలను, మనం
పని చేసే చోట తోటి వారి జీవితాలను కూడా సమస్యాత్మకంగా మారుస్తాయి. కొందరు జీవిత
అనుభవాలను ఎదుర్కొనే సమయంలో తదుపరి స్థాయికి వెళతారు. ఈ ఊగిసలాటలు అణిచివేసేందుకు
ముఖానికో ముసుగు తొడుక్కుని ప్రదర్శనకు శిక్షణ పొందుతారు. ఈ స్థితిలో ఈ డోలనాలు
లోపలే ఉంటాయి. కానీ ధైర్యంగా, ఆహ్లాదకరంగా ఉన్నట్లు
ప్రవర్తించడం నేర్చుకుంటారు. కానీ ఇది ఎక్కువ కాలం నిలబడదు.
ఎటువంటి
ఊగిసలాటలకు తావులేని సమాధి స్థితిలో నిశ్చలముగా ఉండడం గురించి శ్రీకృష్ణుడు ఈ
శ్లోకములో ఉద్ఘాటించారు. మరో మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ఊగిసలాటలు అనిత్యమైనవని
తెలుసుకుని సమాధిలో నిశ్చలంగా ఉన్న అంతరాత్మను చేరుకోవడం (2.14).
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి