48. 'స్వయం'తో సంతృప్తి

 


శ్రీకృష్ణ భగవానుడు శ్లోకము 2.11 నుంచి శ్లోకము 2.53 వరకు సాంఖ్యయోగం అంటే ఏమిటో వెల్లడించారు. ఇది అర్జునుడికి పూర్తిగా కొత్త విషయం . అర్జునుడు సమాధిని సాధించిన స్థితప్రజ్ఞ పురుషులను గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఒక స్థితప్రజ్ఞత గల వ్యక్తి ఎలా మాట్లాడుతారో, కూర్చుంటారో, నడుస్తారో తెలుసుకోవాలను కున్నాడు.

      శ్లోకం 2.55 నుండి, అర్జునుడికిచ్చే వివరణల ద్వారా, శ్రీకృష్ణుడు, మన చంచల మనస్సుని అదుపులో పెట్టడానికి కొలమానాలను నిర్ధారించారు. వీటిని ఉపయోగించుకొని ఆధ్యాత్మిక ప్రయాణంలోని మన పురోగతిని స్వయంగా కొలుచుకోవచ్చు.

      శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, “మనస్సు నందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడై, ఆత్మానందమును పొందినవానిని స్థితప్రజ్ఞుడని యందురు” (2.55). ఒక వ్యక్తి తనపట్ల తాను సంతృప్తి చెందినప్పుడు కోరికలు వాటంతటవే రాలిపోతాయి. కోరికలు రాలిపోయినప్పుడు వారు చేసే చర్యలన్నీ నిష్కామ కర్మలు అవుతాయి.

      ఉన్నదానికంటే భిన్నంగా ఉండాలనేది మన ప్రాథమిక కోరిక. మనం మనకున్న ప్రస్తుత పరిస్థితితో చాలా త్వరగా విసుగు చెందుతాము. ఈ స్థితిని అర్థశాస్త్రంలోతీరిన కోరిక మనల్ని ప్రేరపించలేదుఅని అంటారు. ఈ విషయాన్ని మనమందరము ఇతరులపై ఒక వ్యూహంగా ఉపయోగిస్తాము. దాని వలన స్థితప్రజ్ఞను పొందడం కష్టతరం అవుతుంది. ఉదాహరణకు, వినియోగదారుల కోసం ఉత్పత్తుల కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మోడల్స్ ను పరిచయం చేస్తాయి. ఎందుకంటే మనం ప్రతిసారీ విభిన్నమైన మోడల్ ను తీసుకోవాలని కోరుకుంటామనే విషయం వారికి బాగా తెలుసు.

      మరోవైపు, మనం మనపట్ల సంతృప్తి చెందకపోతే కుటుంబ సభ్యులతో సహా ఇతరులు మన వల్ల సంతోషంగా ఉండాలని ఎలా ఆశించగలం? అట్లాగే తమను తాము తృప్తి పరచుకునే సమర్థత లేని వారి నుంచి మనం సంతృప్తిని ఎలా పొందగలం? ,

      కోరికలను వదిలివేయడానికి సుఖాన్ని వెంటాడడం ఎండ మావిని వెంబడించడం లాంటిదన్న లోతైన అవగాహన కావాలి. జీవిత అనుభవాలన్నీ ఈ ప్రాథమిక సత్యాన్ని మాత్రమే ధృవీకరిస్తున్నాయి. కోరికలను వదిలేయడానికి ఆచరణాత్మక మార్గం ఏమిటంటే వాటి తీవ్రతను తగ్గించడం, వాటిని వెంబడించడం తగ్గించడం. ఇలా చేయడం వల్ల మనం ఎంత ప్రశాంతంగా ఉండగలమో అర్ధమవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

4. మనస్సు ఆడించే ఆటలు

6. శాసన నియమాలు