86. కామం, సంకల్పం రెండింటినీ త్యజించాలి


ప్రతి ఒక్క నాగరికతలోనూ సమాజ శాంతి, సహజీవనం కోసం కొన్ని పనులను చేయదగినవిగా, మరికొన్నింటిని చేయ కూడనివిగా విభజించారు. న్యాయ వ్యవస్థల అభివృద్ధితో కొన్ని చేయకూడని పనులు శిక్షార్హమైన నేరాలుగా మారాయి. న్యాయశాస్త్రం ప్రకారం ఒక నేరంలో 'ఉద్దేశం', 'అమలు' రెండిటి మీదా ఆధారపడి నేరనిర్ధారణ జరుగుతుంది. 'ఉద్దేశం' అనేది నేరం చేయాలనే ఆలోచన. ఏ వ్యక్తినైనా దోషిగా నిలబెట్టడానికి రెండు భాగాల రుజువు అవసరం.

ఉద్దేశాన్ని సంకల్పంగా, అమలును కామంగా గుర్తిస్తే కృష్ణుడి సూక్తిని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు, “ఎవని కర్మలన్నియును, శాస్త్ర సమ్మతములై, కామసంకల్పవర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో, అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురుఅని శ్రీకృష్ణుడు చెప్పారు(4. 19).

సాధారణంగా సమాజంలో ఎవరైనా నేరపూరిత ఉద్దేశ్యంతో తిరుగుతున్నప్పటికీ నేరం చేయనంత వరకు ఏ విధమైన సమస్య ఉండదు. కానీ మనం ముందుగా ఉద్దేశ్యాన్ని వదిలి వేయడంతో పాటే సంకల్పాన్ని కూడా వదులుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పారు.

చట్టం పట్ల భయం, ధనము మొదలైన వనరుల కొరత లేదా తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడం వంటి వివిధ కారణాల వల్ల మనుషులు కామాన్ని వదిలివేయడం జరుగుతుంది. కానీ సంకల్పం చాలా లోతుగా ఉంటుంది. జీవితకాలంలో ఎప్పుడైనా అది ఒక బలహీనమైన క్షణంలో కామంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు మనకు కేవలం కామాన్ని మాత్రమే కాకుండా కోరికలకు చోదకమైన సంకల్పాన్ని కూడా వదులుకోమని చెప్పారు.

విద్య, ఆర్థిక, వ్యక్తిగత వృద్ధిని సాధించాలనే సంకల్పం, కోరికలను కలిగి ఉండాలని చిన్నతనం నుండి మనకు పదేపదే చెప్పారు. అందువలన ఈ అస్తిత్వ సత్యాన్ని అర్ధం చేసుకోవడంలో మన పురోగతి కష్టమవుతుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే కోరిక అనేది శ్రేష్ఠమైనదైనా, హీనమైనదైనా అది కోరికే కాబట్టి దాన్ని వదిలివేయాలి.

కామం, సంకల్పం వదిలివేయబడినప్పుడు ఒక వ్యక్తి నిశ్చల సమాధిని పొందుతాడు. ఆసక్తి, భయం, కోపం నుండి విముక్తి పొందుతాడు. అటువంటి స్థితి నుండి ఉత్పన్నమయ్యే కర్మలు ఈ అవగాహన ద్వారా శుద్ధి చేయబడతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

1. అహంకారం తో ఆరంభం

26. గులాబీ ఎన్నడూ పద్మం కాలేదు

6. శాసన నియమాలు