87. నిత్యతృప్తి

 

ఆకలితో ఉన్న నక్క పైన వేలాడుతున్న ద్రాక్ష కోసం ప్రయత్నించి, విఫలమై అందని ద్రాక్ష పుల్లగా ఉందని భావించింది. ఈ సుపరిచితమైన కథ మనము జీవితంలో అనుభవించే నిరాశ, అసంతృప్తి, ఆనందాలను అనేక కోణాలలో చూపిస్తుంది. సమకాలీన మనస్తత్వ శాస్త్రం క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడటానికి మానవ మెదడు యొక్క విధుల్లో ఒకటైన 'ఆనందాన్ని సంశ్లేషణ చేయడం' గురించి మాట్లాడుతుంది. ద్రాక్ష పుల్లగా ఉందని తనని తాను తృప్తి పరచుకుని ముందుకు సాగుతూ నక్క కృత్రిమ ఆనందాన్ని సృష్టించుకుంది.

తృప్తి గురించి వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు 'సృష్టించుకున్న ఆనందాన్ని' అధిగమించాలని ఇలా చెప్పారు, " సమస్త కర్మలయందును, వాటి ఫలితములు యందును సర్వదా ఆసక్తిని వీడి, సంసార-ఆశ్రయ రహితుడై, నిత్యతృప్తుడైన పురుషుడు, కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికినీ వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు” (4.20). స్వయం తృప్తి అనేది భగవద్గీతలోని మూలోపదేశాలలో ఒకటి. చాలా సందర్భాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మవాన్ లేదా ఆత్మతృప్తితో ఉండమని సలహా ఇస్తారు. ఇది ఆత్మతో సంతృప్తి చెందడం తప్ప మరేదీ కాదు. ఆత్మవాన్ అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతృప్తి యొక్క పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటారు.

అంతకుముందు శ్రీకృష్ణుడు కర్మ, అకర్మ గురించి మాట్లాడుతూ ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో తెలివైనవారు కూడా గందరగోళానికి గురవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత శ్లోకంలో, ఆయన కర్మలో అకర్మ గురించి వివరిస్తూ ఒక నిత్యతృప్తుడు కర్మ చేస్తూ ఉన్నప్పటికీ ఏమీ చేయనట్లేనని చెబుతారు.

మనం ఈ రోజు ఉన్న దానికంటే భిన్నంగా ఉండాలను కొనడమే మన మౌలిక కోరిక. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కోరిక ప్రకారమే మనం ఎన్నో సాధించిన తర్వాత మళ్లీ కొత్త కోరిక పుట్టి మరొక విధంగా ఉండాలని కోరుకుంటాము. భోగాలు, ఆస్తుల వేటలో కూడా గమ్యాలు నిరంతరం మారుతూ ఇదే కథ పునరావృత మవుతుంది.

భోగాలు, ఆస్తులలాగా మనను వెంబడించేవన్నీ ఎండమావులు తప్ప మరేమీ కావని, అలా వెంబడించడం వల్ల మనకు అనారోగ్యం, అలసట కలుగుతుందనే స్పృహ వచ్చినప్పుడు కర్మఫలాల మీద మోహం వదిలేసి నిత్యతృప్తులమవుతాము. ఇది ఏ కారణం లేకుండా నవ్వుతూ, ఆనందంగా ఉండే చిన్నపిల్లల స్థితిలో ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

6. శాసన నియమాలు

42. అహంకారపు వివిధ కోణాలు.

73. సమర్పణ కళ