91. స్వీయ అధ్యయనం
'కడుపులో
కాలటం' అంటే భౌతిక ప్రపంచంలో తన కోరికలు నెరవేర్చుకోవడానికి
అభిరుచులు; విధులను కొనసాగించడానికి కావలసిన శక్తి, ఉత్సాహంతో నిండి ఉండటం. అటువంటి శక్తిని ఆత్మసాక్షాత్కారం కోసం
ఉపయోగించినప్పుడు దానిని 'యోగ-అగ్ని' అంటారు.
ఈ సందర్భంలో, “మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను,
ప్రాణముల క్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయమ యోగ
రూపాగ్నిలో హవనము చేయుచుందురు” (4.27) అని శ్రీకృష్ణుడు
చెప్పారు.
రోజువారీ
జీవితంలో, మనం పరమాత్మకు అందమైన పువ్వులు, రుచికరమైన ఆహారం వంటి ఇంద్రియాకర్షక వస్తువులను సమర్పిస్తాము. మనల్ని
వీటిని అధిగమింప జేసి, యజ్ఞం (నిష్కామకర్మ) అంటే కేవలం
ఇంద్రియ వస్తువులను మాత్రమే అర్పించడం కాదని; రుచి, అందం లేదా వాసన వంటి ఇంద్రియ కార్యకలాపాలను కూడా అర్పించడమని ఈ శ్లోకం
చెబుతుంది. ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువుల యందు ఆసక్తి,
విరక్తి ద్వారా మనల్ని బాహ్య ప్రపంచంతో కలుపుతూనే ఉంటాయి. ఈ
ఇంద్రియాలను త్యాగం చేసినప్పుడు ఆసక్తి, విరక్తి నశించిపోయిన
తర్వాత మిగిలేది పరమాత్మతో ఐక్యతే.
“కొందరు
ద్రవ్యసంబంధ యజ్ఞములను, మరికొందరు తపో రూప యజ్ఞములను,
కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్షణ
వ్రతములను చేపడుతారు, కొందరు యత్నశీలురై స్వాధ్యాయరూప జ్ఞాన
యజ్ఞములను ఆచరిస్తారు”(4.28) అని శ్రీకృష్ణుడు చెప్పారు.
శ్రీకృష్ణుడు
స్వ-అధ్యయనాన్ని యజ్ఞంలో ఒక భాగంగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మనస్తత్వశాస్త్రం, వైద్యం, సమకాలీన వ్యక్తిత్వ వికాస రచనల వంటి అనేక
విషయాల పుట్టుకకు దారితీసింది. బాల్యం నుండే మనం పుట్టుక ద్వారా పొందిన జాతీయత,
కులం లేదా మతం వంటి విభజనల ద్వారా నిరంతరం గుర్తింపబడతాము. ఈ గుర్తింపుల
రక్షణకే మనము జీవితాంతం పాటుపడతాము. అణచివేత లేదా హింస ద్వారా ఈ విభజనలను మన చిన్న
వయసు లోనే మనమీద బలవంతంగా రుద్దుతారు. తెలివైన వారు- తెలివి తక్కువవారు, కష్టపడేవారు లేదా సోమరిపోతులు వంటి లక్షణాల ఆధారంగా కూడా ఈ విభజన
జరుగుతుంది. ఈ జాబితాకు అంతం లేదు.
అదేవిధంగా మనం
అనేక అంశాల ఆధారంగా మన గురించి, ఇతరుల గురించి
అభిప్రాయాలను ఏర్పరుచుకుంటాము. వాటిని రక్షించడానికి మన శక్తిని వృధా చేస్తూ
ఉంటాము. స్వీయ అధ్యయనం అంటే ఈ కృత్రిమ విభజనలను యజ్ఞంగా పరిశీలించి వాటిని
త్యజించడం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి